బిల్లుల ఆమోదంలో జాప్యంపై..కేంద్రం, గవర్నర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..!

Supreme Court

న్యూఢిల్లీః పినరయి విజయన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదించడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

అసెంబ్లీ ఆమోదం తెలిపిన ఎనిమిది బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలుపుడం సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ కోర్టుకు తెలిపారు. స్పందించిన సుప్రీంకోర్టు విచారణకు రావాలని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి కోర్టు నోటీసులు జారీ చేసింది. లేదంటే సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతానైనా రావాలంటూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది కేకే వేణుగోపాల్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం తాను శాసనసభలో భాగమని గవర్నర్‌ అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు.

గత ఏడు నుంచి 21 నెలలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎనిమిది బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తీవ్ర జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం తన పిటిషన్‌లో ఆరోపించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం సైతం ఇదే తరహాలో గవర్నర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్టాలిన్‌ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను డిసెంబర్‌ ఒకటో తేదీకి సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.