నేడు “ప్రజాపాలన” వెబ్ సైట్ ప్రారంభం

తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..ప్రజా పాలన కార్యక్రమం తీసుకొచ్చి..కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి అభ్యర్థుల నుండి దరఖాస్తు పత్రాలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ ప్రజాపాలన నిర్వహణ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించింది ప్రభుత్వం. prajapalana.telangaana.gov.in పేరుతో రూపొందించిన ఈ సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించనున్నారు.

ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,25,84,383 (కోటి 25 లక్షల 84 వేల 3 వందల 83) దరఖాస్తులు వచ్చాయి. గ్యారంటీల అమలు కోసం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దారఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఈరోజు (జనవరి 8న) డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ ను ప్రారంభించనున్నారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు, సి.జి.జి డైరెక్టర్ జనరల్, జీహెచ్ఎంసీ కమీషనర్ తదితర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరుకానున్నారు.