బిఆర్ఎస్, కాంగ్రెస్ పనులు ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవుఃకిషన్ రెడ్డి

ఉద్యమకారులను బలితీసుకున్న పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు

kishan-reddy

హైదరాబాద్ ః బిజెపి మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, బీసీ ముఖ్యమంత్రి హామీ అందరినీ ఆకర్షిస్తోందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… యువత, మహిళలు ప్రధాని మోడీకి అండగా నిలబడుతున్నారన్నారు. బిజెపి, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా బిజెపికి జైకొడుతున్నట్లు చెప్పారు. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది బిజెపి మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు. ఇతర పార్టీల నేతల మాటలు కోటలు దాటుతాయని, కానీ చేసే పని మాత్రం ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కారణంగా తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తొలి విడతలో 369 మంది, మలివిడతలో 1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తోన్న ఫేక్ గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బిజెపిని విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి ముందంజలో ఉందని, తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని చెప్పారు. బిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బిజెపిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్నారు.

బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ప్రచార రథాలను ప్రజలు గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి నెలకొందన్నారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోందని, కానీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. దళితబంధు, రుణమాఫీ, బీసీ బంధు, దళిత ముఖ్యమంత్రి హామీలపై అధికార పార్టీని ప్రజలు నిలదీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇన్నాళ్లు పోలీసులకు భయపడ్డారని, కానీ ఎలాగూ కేసీఆర్ దిగిపోతున్నాడని అర్థమై, ఇప్పుడు నిలదీస్తున్నట్లు చెప్పారు. కొన్ని సర్వే సంస్థలు దొంగ లీకేజీలు ఇస్తున్నప్పటికీ బిజెపి… పార్టీ అభ్యర్థులకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదన్నారు.