మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌

Medaram jatara
Medaram jatara

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ తెలిపింది. భక్తుల ఇంటికే సమ్మక్క- సారలమ్మ ప్రసాదాన్ని అందించే టీఎస్ఆర్టీసీ సౌకర్యం బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ సౌకర్యాన్ని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో, పేటీఎం ఇన్ సైడర్ యాప్​లో ఆన్​లైన్​ ద్వారా పొందవచ్చు. ఈ నెల 14 నుంచి 25 వరకు ఆఫ్​లైన్​, ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న భక్తులను అమ్మవారి ప్రసారం అందిస్తామని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సూచించారు.

తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది.

ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర జరగబోతుంది. ఈ క్రమంలో TSRTC భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారం కు బస్సులను ఏర్పాటు చేస్తుంది. అలాగే 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మేడారం జాతర ఈ నెల 21 నుంచి 24 వరకు జరుగుతుండగా.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు తెలిపింది.

అలాగే గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా సమ్మక్క- సారలమ్మ అమ్మవార్ల ప్రసాదాన్ని భక్తుల ఇంటికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టింది. దేవాదాయ శాఖతో ఆర్టీసీ సంస్థ లాజిస్టిక్స్(TSRTC) విభాగం ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవారి ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తులకు సంస్థ అందజేయనుంది.