రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు జగన్ తోనే ప్రయాణం: అనిల్ కుమార్ యాదవ్

గొర్రెల్లో ఒకడిగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండటమే మంచిదని వ్యాఖ్య

ex-minister-anil-kumar-yadav-gave-clarity-on-fake-news

అమరావతిః రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు సీఎం జగన్ తనను తిట్టినా, గెటవుట్ అన్నా, తన వల్ల పార్టీకి నష్టమన్నా కూడా జగన్ కోసమే పనిచేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ‘‘నా పేరుతో తప్పుడు వార్తలతో ప్రచారం చేసినంత మాత్రాన ఈ ఫేక్ గాళ్లకు ఒరిగేదేం లేదు. నా పేరును వాడుకుని డబ్బులు సంపాదించుకుంటూ, సుఖంగా ఉన్నారంటే దాన్ని కూడా స్వాగతిస్తా. నా తండ్రి సాక్షిగా రాజకీయాల్లో కొనసాగినంత కాలం జగనన్నతోనే నా ప్రయాణం’’ అని తేల్చిచెప్పారు.

‘‘జగన్ నన్ను తరిమేసే పరిస్థితి ఎన్నటికీ రాదు. ఒకవేళ అదే జరిగినా చివరి శ్వాస వరకు జగన్‌ కోసమే పనిచేస్తా. పేరున్న గొర్రెల్లో ఒక గొర్రెగా ఉండే కంటే.. ఒంటరిగా సింహంలా ఉండటమే మంచిది’’ అని అన్నారు. మోకాలి సమస్య కారణంగా తాను గత కొన్ని రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నానని, దయచేసి దీనిపై తప్పుడు వార్తలు రాయొద్దని కోరారు. పూర్తిగా కోలుకున్న వెంటనే తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ స్పస్టం చేశారు.

ఎవరితోనైనా తనకు సెట్ కాకుంటే దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తనను రమ్మని పిలిస్తే వెళ్లి మాట్లాడుతానని చెప్పారు. ‘‘ఒకరి మీద చాడీలు చెప్పే మనస్తత్వం నాది కాదు. ఏడాది నుంచి సైలెంట్ గా ఉన్నా. ఇప్పుడు జగన్‌ వద్ద ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటపెడతా’’ అని చెప్పారు. ‘‘అన్నని నేను ఏ విషయంలోనైనా ఒప్పించుకోగలను. ‘అనిల్.. నువ్వు ఇక్కడ పోటీ చేయొద్దు.. ఓడిపోతావు’ అంటే గమ్మున ఉంటా. బిడ్డ మీద తండ్రి కోప్పడడా.. అన్న మీద తమ్ముడు కోప్పడడా? అలా కోప్పడటం లేదంటే అది ఫేక్ అని అర్థం’’ అని అనిల్ చెప్పుకొచ్చారు.