బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం

నల్గొండలో జరిగిన బీఆర్ఎస్​ బహిరంగ సభ నుంచి తిరిగి హైదరాబాద్​ వస్తున్న క్రమంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే తలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఓ హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా మరొకరిని ఆసుపత్రికి తరలించారు.

కారులో ఉన్న ఎమ్మెల్యే తలకు స్వల్పగాయాలయ్యాయి. అదే కారులో ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్​మెన్లు ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఎమ్మెల్యే లాస్య నందిత తన సోదరితో కలిసి మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు. ప్రమాదానికి గురైన రెండు కార్లను పోలీసులు నల్గొండ రూరల్‌ పోలీస్​ స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటనలో చనిపోయిన హోంగార్డును నార్కట్‌పల్లి పోలీస్​ స్టేషన్​లో పనిచేస్తున్న నవ కిషోర్​గా గుర్తించారు.

మరోవైపు లాస్యనందిత కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తాను క్షేమంగా ఉన్నానంటూ లాస్యనందిత ఎక్స్‌లో ట్వీట్ చేశారు. స్వల్ప గాయాలతో బయటపడ్డానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత ప్రథమ చికిత్స తీసుకుని హైదరాబాద్ బయల్దేరినట్లు ట్వీట్ చేశారు.