నిన్న కొట్టిన వాన..వేసవిలోనే రికార్డు వాన

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం నుండి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ అకాలవర్షం..వేసవిలోనే రికార్డు వర్షం అని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండగా ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాజధాని హైదరాబాద్‌లో ఏకంగా గంటకు పైగా భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడిక్కడే భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

శేరిలింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెం.మీ, కేపీహెచ్‌పీలో 10.73, సికింద్రాబాద్‌లో 8.4, అల్వాల్‌లో 7 సెం.మీ, గాజులరామారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్లగొండ, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో 6 సెం.మీపైగా వాన కురిసినట్టు తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడ్డాయి. రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో తొమ్మిది జిల్లాలకు హెవీ రైన్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.