కొనసాగుతున్న షర్మిల నిరాహారదీక్ష

YSRTP అధ్యక్షురాలు వైస్ షర్మిల నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని నిన్న మధ్యాహ్నం ఆమె ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చెంత నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే వెంటనే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి లోటస్ పాండ్ నివాసం వద్దకు తరలించారు. దీంతో ఆమె తన ఇంటి వద్దే దీక్షను కొనసాగిస్తున్నారు. రాత్రంతా దీక్ష వేదికపైనే గడిపారు. రెండో రోజు కూడా దీక్ష చేస్తున్నారు. కనీసం నీరు కూడా తాగకుండా దీక్ష చేస్తుండడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది.

మరోవైపు ఆమెకు అపోలో ఆసుపత్రి వైద్యులు చంద్రశేఖర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఆమె కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని వైద్యులు చెపుతున్నారు. మరోవైపు తన కూతురు దీక్షకు సంఘీభావంగా వైఎస్ విజయమ్మ దీక్షాస్థలిలో కూర్చున్నారు. దీక్ష నేపథ్యంలో లోటస్ పాండ్ ను భారీగా పోలీసులు దిగ్బంధించారు. పార్టీ కార్యకర్తలను లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇంకోవైపు బొల్లారం పోలీస్ స్టేషన్లో 40 మంది పార్టీ నేతలు, బంజారాహిల్స్ పీఎస్ లో ఏడుగురు నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు.