నిప్పుల కుంపటిగా మారిన తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు నిప్పుల కుంపటిగా మారుతుండడం తో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే ఇళ్లలోనుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ విధంగా ఎండలు ఉంటె..మే నెలలో ఇంకెలా ఉంటాయో అని భయపడుతున్నారు. రెండు రోజులపాటు రాష్ర్టానికి తీవ్రమైన ఎండలతోపాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా ఎండ తీవ్రత పెరిగింది. ఆదివారం మరింత తీవ్రస్థాయికి చేరినట్టు అధికారులు తెలిపారు. గడిచిన పదేండ్లలో ఎన్నడూ లేనంతగా.. సాధారణం కన్నా 6.1 డిగ్రీలు అదనంగా నమోదైనట్టు చెప్పారు. ఇదిలా ఉంటె రాష్ట్రవ్యాప్తంగా నాలుగురోజులు వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ పేరొన్నది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. త్వరగా వర్షాలు పడితే బాగుండని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.