అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా మారబోతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. సాయంత్రంలోగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నేడు ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నెల 16 నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున బుధ, గురువారాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.