సబితా ఇంద్రారెడ్డి సన్నిహితుడి ఇంట్లో భారీగా డబ్బు పట్టివేత

telangana-minister-sabitha-indra-reddy-press-meet

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ నేతల ఇళ్లే టార్గెట్‌గా దాడులు జరగ్గా.. ఈనెల 13న ఉదయం నుంచి నగరంలోని 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్‌, సిబ్బంది ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.

గత మూడురోజులుగా మంత్రి సబిత అనుచరుడు ప్రదీప్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించగా.. నేటితో సోదాలు ముగిశాయి. ప్రదీప్ రెడ్డితో పాటు రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిగాయి. నరేందర్ రెడ్డి ఇంట్లో 7.50 కోట్లు, ప్రదీప్ రెడ్డి ఇంట్లో రూ.5 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ డబ్బు మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్నదిగా ప్రచారం జరుగుతోంది. ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డికి మంత్రి సబితా కుమారుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు.

ఇక మహేశ్వరం నియోజకవర్గాన్ని అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఆమెను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉందంటూ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఒకప్పుడు సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరొక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మరి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో చూడాలి.