ప్రజలకు చల్లటి వార్త.. రాష్ట్రాలకు వర్ష సూచన

గత రెండు నెలలుగా విపరీతమైన ఎండ, ఉక్కపోత తో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. చాల జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 08 గంటలకే భానుడు భగభగమంటున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు, పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. దక్షిణ కోస్తాంధ్రలోనూ కొన్ని చోట్ల చినుకులు పడనున్నాయి.

దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కర్ణాటక నుంచి తమిళనాడు, ఏపీ వైపు వీచనున్నాయి. మరికొన్ని గంటల్లో మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఏపీలోనూ కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.