మహిళా కూలీకి చెంపదెబ్బ..జీవన్ రెడ్డి తీరుపై బిఆర్ఎస్ ఆగ్రహం

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి టీ జీవన్‌రెడ్డి.. ఓ మహిళ కూలి చెంప ఛెళ్లుమనిపించింన ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌పేట్‌, చేపూర్‌, పిప్రి గ్రామాల్లో జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి ఓ మహిళా కూలీతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె వినయ్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ‘మొన్న ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓటేసిన’ అని చెప్పింది. అప్పటికే ఆమె చెంప తడుతూ ఉన్న జీవన్‌రెడ్డి ఒక్కసారిగా ఛెళ్లుమనిపించారు. దీంతో విస్తుపోయిన ఆ వృద్ధురాలు, క్షణాల్లోనే తేరుకొని తననుతాను సంభాళించుకున్నది. ‘నాకు పింఛినయితే ఇవ్వండి సారు..’ అంటూ చేతులు జోడించి ఆమె వేడుకోగా, ‘వెళ్లి ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని అడుగు’ అంటూ వినయ్‌రెడ్డి విసుగ్గా చెప్పడం వీడియోలో కనిపించింది. దీనిపై యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు బుద్ది రావాలంటే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని కామెంట్స్ చేస్తున్నారు.