రాష్ట్రంలో యూకే వైరస్‌ నమోదు?

అప్రమత్తమైన ఆరోగ్యశాఖ

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న యూకే వైరస్‌ తొలి కేసు రాష్ట్రంలో నమోదైనట్లు సమాచారం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా వాసికి యూకే కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీసీఎంబీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించింది. యూకే వైరస్‌పై అధికారికంగా వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారించలేదు. బాధితుడితో పాటు అతడి తల్లికి కూడా వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించింది. వరంగల్‌కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి ఈ నెల రాష్ట్రానికి రాగా.. కొత్తగా మార్పు చెందిన వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 16న లక్షణాలు కనిపించగా.. స్థానికంగా పరీక్షలు నిర్వహించారు. 22న వెల్లడైన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్పటి నుంచి వరంగల్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల కిందట నమూనాలు సేకరించి సీసీఎంబీకి తరలించారు.

వైరస్‌ జన్యు పరిణామ క్రమ విశ్లేషణ పరీక్షల్లో యూకేలో మార్పు చెందిన వైరస్‌, ఇది ఒకటేనని నిర్ధారణకు వచ్చారు. ఆదివారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించింది. కుటుంబ సభ్యుల్లో 71 ఏళ్లు ఉన్న బాధితుడి తల్లికి పాజిటివ్‌గా తేలగా.. మిగతా వారందరికీ నెగెటివ్‌ వచ్చింది. వృద్ధురాలి నమూనాలు సేకరించి సీసీఎంబీకి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు పేర్కొన్నారు. మరో ఏడు రోజుల నుంచి పది రోజుల పాటు పర్యవేక్షించనున్నారు. తాజాగా నిబంధనల ప్రకారం.. రెండు సార్లు కరోనా పరీక్షల్లో వస్తేనే నెగెటివ్‌ ముప్పు తప్పినట్లు భావిస్తున్నారు. అలాగే బాధితుడితో సన్నిహితంగా మెదిలిన వారికి వారం నుంచి పదిహేను రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/