రాయ్​బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ

గాంధీ-నెహ్రు కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. అమేఠీలో గాంధీ కుటుంబ విధేయుడు కేఎల్ శర్మ పోటీ చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. అయితే రాయ్​బరేలీ, అమేఠీ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుంది. దీంతో మరికొద్ది గంటల్లో రాహుల్ గాంధీ, కిశోరీ లాల్ శర్మ నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

ఇక ప్రియాంకా గాంధీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని స్పష్టమైంది. రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ హాజరయ్యే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, రాయబరేలీ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దినేశ్ ప్రతాప్ సింగ్‌ను బీజేపీ గురువారం ప్రకటించింది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన సోనియా గాంధీ చేతిలో పరాజయం పొందారు.