తెలంగాణ ప్రభుత్వం ఫై అనుమానం వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చ కు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు వ్యవహారం పై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేసారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో కూడా రాజ్ భవన్ ను లాగాలని చూశారని తమిళిసై అన్నారు. రాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్ ఆడియో టేస్ విషయంలోనూ రాజ్ భవన్ ప్రస్తావన వచ్చిందన్నారు. తన మాజీ ఏడీసీ తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని, తుషార్ గతంలో తనకు ఏడీసీగా పని చేశారని తెలిపారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందని తమిళిసై అనుమానం వ్యక్తం చేసారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని అన్నారు.

పలు బిల్లుల విషయంలో ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించిన గవర్నర్… అదే విషయమై ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు ఎందుకని ప్రశ్నించారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు చెల్లుబాటుపై తమకు అనేక సందేహాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై ఉన్న అనుమానాలను తీర్చాల్సి ఉందని, అందుకే బిల్లుల ఆమోదానికి కొంత సమయం పడుతోందన్నారు. ఈలోపే తనపై తప్పుడు ప్రచారం చేశారని , కావాలనే బిల్లులను ఆపుతున్నారనేది అవాస్తవమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను సమగ్రంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. విద్యార్థి సంఘాలతో రాజ్ భవన్ ముందు ఆందోళనలకు రెచ్చగొడుతున్నారని తమిళిసై అన్నారు.