హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదు : అసదుద్దీన్​ ఒవైసీ

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ హత్యను ఖండించిన ఎంఐఎం నేత

asaduddin owaisi
asaduddin owaisi

హైదరాబాద్ : ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో హిందూ టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేయడాన్ని ఖండించారు. ఇలాంటివి జరగాల్సింది కాదని పేర్కొన్నారు. భోపాల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఉదయ్ పూర్ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సింది. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదు. దేశంలో తీవ్రవాదం విస్తరిస్తోంది..” అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఇలాంటి హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవరూ సమర్థించబోరని స్పష్టం చేశారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మను కేవలం సస్పెండ్ చేసి వదిలి పెట్టడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆమెను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలకు నుపూర్ శర్మ వ్యాఖ్యలే కారణమయ్యాయని మండిపడ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/