ఇలాంటి జలగ మనకెందుకు?: చంద్రబాబు విమర్శలు

అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ

chandrababu

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా పీలేరులో ‘రా కదలిరా’ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… పీలేరు జన గర్జన రాష్ట్రం అంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు. ప్రజాకోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం సమీపించిందని, వైఎస్‌ఆర్‌సిపికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని అన్నారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం అని, అందులో గెలిచేది టిడిపి-జనసేన కూటమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు.

కాగా, ఈరోజు భీమిలిలో సీఎం జగన్ ‘సిద్ధం’ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. ఎన్నికలు వస్తేనే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. మద్య నిషేధంపై మాట తప్పిన వ్యక్తి జగన్… అలాంటి వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు.

అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్ డీ చేశారని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన విధానం అని వివరించారు. ఇలాంటి జలగ మనకెందుకు?… మరోసారి చెబుతున్నా… వై నాట్ పులివెందుల? అంటూ చంద్రబాబు సమరోత్సాహం ప్రకటించారు.

జగన్ కు అభ్యర్థులు దొరకడంలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ కసినంతా జగన్ పై చూపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత వైఎస్‌ఆర్‌సిపి చరిత్ర ముగిసిపోతుందని అన్నారు.