శ్రీకాళహస్తిలో కొత్త దేవాదాయశాఖ మంత్రికి చేదు అనుభవం

కొత్తగా దేవాదాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొట్టు సత్యనారాయణకు ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి బయటకు వస్తున్న సమయంలో భక్తులు ఒక్కసారిగా మంత్రి ఫై విమర్శలు కురిపించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆగ్రహం వ్యక్తం చేసారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న తరుణంలో మంత్రి దర్శనానికి రావడం.. అధికారులు గంటల తరబడి స్వామివారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా తొలసారి ఆలయ దర్శనానికి వస్తుండటంతో అధికారులు అపూర్వ స్వాగతం పలికారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి కుమార్తె పవిత్రా రెడ్డి మంత్రి పర్యటనను దగ్గరుండి చూసుకున్నారు. అయితే, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డ భక్తులకు చివరికి సహనం నశించి.. మంత్రి సత్యనారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెట్టి, కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇప్పించలేదని మండిపడ్డారు. డౌన్ డౌన్ మంత్రి అంటూ భక్తులు చేసే నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. 4 గంటల పాటు చిన్న పిల్లల్ని వేసుకుని క్యూలైన్లలో వేచి ఉన్నామని వాపోయారు. భక్తుల ఆగ్రహాన్ని గమనించిన మంత్రి కొట్టు సత్యనారాయణ స్వయంగా భక్తుల వద్దకు వచ్చి సర్దిచెప్పారు. మంత్రి జోక్యంతో అధికారులు వెంటనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు.