నేడు ఢిల్లీ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..

నేడు ఢిల్లీ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కాబోతుంది. సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించి, ఆ పార్టీ జెండాను ఎగరవేస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12.37 గంటలకు ఆ కార్యాలయాన్ని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి జేడీఎస్‌ నేత కుమారస్వామి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తోపాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.

బుధవారం మధ్నాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయానికి కేసీఆర్‌ చేరుకొంటారు. అక్కడ నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మలతోపాటు వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర తేజ తదితరులు యాగ క్రతువులో భాగస్వామ్యులయ్యారు. మంగళవారమే గణపతి పూజతో యాగం మొదలయ్యింది. పూర్ణాహుతి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకొని తన కార్యాలయంలో కుర్చీలో ఆసీనులవుతారు. పార్టీకి సంబంధించిన పత్రాలపై సంతకం చేయనున్నారు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో సొంత భవనం నిర్మిస్తున్నారు. మరో ఐదారు నెలల్లో ఇది సిద్ధమవుతుంది.


బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.