దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది

ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒడిశాలో వరుస ప్రమాదాలు ప్రయాణికులనను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వారం క్రితం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురి కావడం తో దాదాపు 270 పైగా మృతి చెందారు. ఈ ఘటన గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే..వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా ఒడిశాలో దుర్గ్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌కు పెనుప్రమాదం తప్పింది. నౌపడా జిల్లాలోని ఖరియార్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ వద్ద పూరీ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం రాత్రి 10 గంటల సమయంలో రైలులోని బీ3 ఏసీ కోచ్‌లో మంటలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బ్రేక్‌ ప్యాడ్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. బ్రేకులను పూర్తిగా వదిలేయకపోవడం వల్ల రాపిడి తలెత్తి మంటలు అంటుకున్నాయని చెప్పారు. బ్రేక్‌ ప్యాడ్‌ మినహా రైలుకు ఎలాంటి నష్టం జరుగలేదని స్పష్టం చేశారు. మంటలను గుర్తించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది.. వాటిని ఆర్పివేశారని వెల్లడించారు. కొద్దిసేపటి తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది.