సంక్రాంతి వేళ..ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

సంక్రాంతి వేళ ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఏపీ ప్రజలు సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు కుటుంబ సభ్యులు , బంధువులతో సందడి సందడిగా ఉంటుంది. ఇక కోడి పందేలు , జూదాలు ఇలా ఒక్కటేంటి అన్ని రకాల పందాలు ఉంటాయి. కోట్ల రూపాయిలు చేతులు మారుతుంటాయి. ఇక మద్యం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక ఈ సంక్రాంతి వేళ రాష్ట్ర సర్కార్ కు మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వచ్చాయి.

గత మూడు రోజుల్లో ఏకంగా రూ.214 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2.33 లక్షలకుపైగా లిక్కర్, 83 వేలకుపైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.27.81 కోట్ల మద్యం అమ్ముడు పోయాయి. ఆ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31న ఏపీలో రూ.127 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా గత మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. నేడు కనుమ సందర్భంగా మద్యం విక్రయాలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.