ఫ్రాన్స్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోడీ

రేపు ఫ్రాన్స్ నేషనల్ డే వేడకల్లో పాల్గొననున్న మోడీ

Prime Minister Modi left for France

న్యూఢిల్లీః ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వాస్తవానికి బాస్టిల్ డే వేడుకులకు విదేశీ నేతలను ఫ్రాన్స్ సాధారణంగా ఆహ్వానించదు. అయితే భారత ప్రధాని ఆ వేడుకలకు హాజరుకావడం ఇది రెండో సారి.

రేపు జరిగే ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్ లో మోడీ పాల్గొంటారు. యూరప్ లోనే అతి పెద్ద సైనిక కవాతుగా పేరుగాంచిన ఈ పరేడ్ లో మోదీ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఈ పరేడ్ లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటుండటం గమనార్హం. ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికార విందుతో పాటు ప్రైవేటు విందుకు కూడా ఇవ్వనున్నారు.

రెండు రోజుల పర్యటనలో మోడీ, మెక్రాన్ పలు అంశాలపై చర్చలను జరపడమే కాకుండా, కీలక ఒప్పందాలను కూడా చేసుకోనున్నారు. ముఖ్యంగా డిఫెన్స్, స్పేస్, సివిల్ న్యూక్లియర్, బ్లూ ఎకానమీ, ట్రేడ్, పెట్టుబడులు, విద్య రంగాలతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఇరు దేశాల అధినేతలు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. తన పర్యటనలో భాగంగా మోడీ ఆ దేశ ప్రధానమంత్రితో పాటు సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతో కూడా సమావేశం కానున్నారు. అంతేకాకుండా భారత్, ఫ్రెంచ్ సంస్థల సీఈవోలతో పాటు ఇతర ప్రముఖులతో కూడా భేటీ అవుతారు.