అన్నమయ్య జిల్లాలో దారుణం ..టమాటో అమ్మిన డబ్బు కోసం హత్య

టమాటో ధర ఓ వ్యక్తి హత్య కు దారితీసింది. ప్రస్తుతం మార్కెట్ లో టమోటో కు ఎంత డిమాండ్ ఉందొ చెప్పాల్సిన పనిలేదు. గతంలో ధరలేక రోడ్ల ఫై పారబోసి రైతులు..ఇప్పుడు అదే టమాటో తో లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆ టమాటో ధరే ఓ రైతు హత్య కు దారితీసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బోడిమలదిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి (63), జ్యోతి దంపతులు ఊరికి దూరంగా తమకున్న పొలంలోనే నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది రాజశేఖరరెడ్డి టమోటా సాగుచేశాడు. టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. వీరు సాగు చేసిన ఎకరా పొలంలో పండిన పంటకు మంచి రేటు దక్కింది. వారం, పదిరోజులుగా రాజశేఖరరెడ్డి తన పొలంలోని టమోటాలను కోసి మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముకుని తిరిగి వస్తున్నాడు. మంగళవారం కూడా మంచి లాభానికి టమోటాను అమ్మాడు.

గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు రాజశేఖర్‌రెడ్డి ఇంటి వద్దకు వచ్చారు. ఎక్కడ ఉన్నాడని భార్య జ్యోతిని అడిగారు. ఎందుకని అడగ్గా, టమోటాలు కావాలని వచ్చామని చెప్పారు. మదనపల్లె డిపోకు పాలు పోయడానికి వెళ్లాడని ఆమె బదులిచ్చింది. అలా వెళ్లిన వ్యక్తి మదనపల్లె రోడ్డులో కాపుకాచి ద్విచక్ర వాహనంపై వస్తున్న రాజశేఖరరెడ్డిని ఆపారు. పక్కనే ఉన్న పొలంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. కాళ్లు, చేతులు వెనక్కి కట్టేసి, నోట్లో టవలు పెట్టి హత్యచేశారు. ఆయన జేబులో టమోటాలు వ్యాపారులకు అమ్మగా తనకు రావాల్సిన డబ్బుల చీటీలు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారించారు. టమాటో అమ్మిన డబ్బు కోసమే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.