తెలంగాణకు ఆమె అవసరం లేదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తా: కేఏ పాల్

వైస్ఎస్ఆర్ కు తెలంగాణకు సంబంధం లేదని వ్యాఖ్య

KA Paul

హైదరాబాద్ః వైఎస్ ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని ప్రవేశపెడతానంటూ షర్మిల పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణకు ఆమె అవసరం లేదన్నారు. అధికారం కోసమే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రాజశేఖర్ రెడ్డికి తెలంగాణకు సంబంధం లేదని, అందుకే తెలంగాణ ప్రజలకు ఇక్కడ రాజన్న రాజ్యం అవసరం లేదని కేఏ పాల్ అన్నారు. షర్మిల సోదరుడు వైఎస్ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చి.. రాజన్న రాజ్యానికి బదులు నిరంకుశ పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తన సోదరుడి బాటలోనే షర్మిల కూడా నడుస్తోందని, తెలంగాణలో కూడా ఇలాంటి ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో షర్మిల కూడా ఉన్నారా? అని ప్రశ్నించారు.

షర్మిల వార్తలను మీడియా కవర్ చేయవద్దని పాల్ సూచించారు. కెసిఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఐటీ దాడుల్లో టిఆర్ఎస్ నేతల ఇళ్లల్లో రూ.కోట్ల పట్టుబడుతున్నాయని చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు. అయితే, ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలో ఇంకా ఎంచుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని తెలుగు ప్రజలను కేఏ పాల్ కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు పాల్ వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/