క‌న్యాకుమారిలో 45 గంట‌ల ధ్యానం చేయనున్న ప్ర‌ధాని మోడీ

PM Modi will meditate for 45 hours at Kanyakumari

న్యూఢిల్లీ : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం నుంచి క‌న్యాకుమారిలో 45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్నారు. ప్ర‌తిష్టాత్మ‌క వివేకానంద రాక్ మెమోరియ‌ల్‌లో ఆయ‌న ధ్యానం చేయ‌నున్నారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కూడా కేదార్‌నాథ్‌లో ప్ర‌ధాని మోడీ ధ్యానం చేసిన విష‌యం తెలిసిందే. క‌న్యాకుమారిలో ప్ర‌ధాని మోడీ ధ్యానంలో పాల్గొనే అంశాన్ని అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల్లో లైవ్ ఇవ్వ‌నున్న‌ట్లు బీజేపీ పార్టీ త‌న ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది.

ఇవాళ సాయంత్రం నుంచి జూన్ ఒక‌టో తేదీ వ‌ర‌కు ఆయ‌న ధ్యాన ముద్ర‌లో ఉంటారు. వివేకానంద రాక్‌లో ఉన్న ధ్యాన మండ‌పంలో ఆయ‌న ధ్యానం చేయ‌నున్నారు. వివేకానంద రాక్‌లో ధ్యానం చేసిన వివేకానందుడు.. భార‌త మాత గురించి అద్భుత విజ‌న్ చేశారు. క‌న్యాకుమారిలో ఉన్న శ్రీ భ‌గ‌వ‌తీ అమ్మ‌న్ ఆల‌యంలో పూజ‌లు చేయ‌నున్నారు. వివేకానంద రాక్ పక్క‌నే ఉన్న తిరువ‌ల్ల‌వురు విగ్ర‌హాన్ని ఆయ‌న విజిట్ చేయ‌నున్నారు. త‌మిళ క‌వి తిరువ‌ల్ల‌వురుకు చెందిన 133 ఫీట్ల ఎత్తైన స్టాచ్యూ అక్క‌డ ఉన్న‌ది.

ఏడ‌వ ద‌శ లోక్‌స‌భ పోలింగ్ జూన్ ఒక‌టో తేదీన ఉన్నందున‌.. ప్ర‌ధాని మోడీ చేప‌ట్ట‌బోయే ధ్యానంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కాంగ్రెస్, డీఎంకే పార్టీలు.. ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశాయి. మోడీ ధ్యానం చేయ‌డం అంటే ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని, అందుకే ఆ ధ్యానం ప్ర‌సారాన్ని నిలిపివేయాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. క‌న్యాకుమారి జిల్లాకు చెందిన డీఎంకే యూనిట్ జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

కాగా, ప్ర‌ధాని మోడీ రాక సంద‌ర్భంగా.. క‌న్యాకుమారిలో సెక్యూర్టీని పెంచేశారు. సుమారు రెండు వేల మంది పోలీసులు ప‌హారా కాస్తున్నారు. ఇండియ‌న్ కోస్టు గార్డు, ఇండియ‌న్ నేవీ కూడా నిఘా పెట్టింది. తిరున‌ల్‌వెల్లి రేంజ్ డీఐజీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సెక్యూర్టీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాని మోడీ రాక నేపథ్యంలో క‌న్యాకుమారి బీచ్‌ను గురువారం నుంచి శ‌నివారం వ‌ర‌కు టూరిస్టుల‌కు క్లోజ్ చేశారు.