భర్తను చంపినా భార్యకు పింఛన్‌ ఇవ్వాల్సిందే

పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు

చండీగఢ్‌: భర్త మరణానంతరం భార్యకు వచ్చే పింఛనుపై పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. భర్తను భార్య హత్య చేసినా, భర్త మరణానంతరం ఆమె మరో వివాహం చేసుకున్నా సరే పెన్షన్ ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం తేల్చి చెప్పింది. కుటుంబ పెన్షన్ అనేది సంక్షేమ పథకమని, ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకే దానిని ప్రవేశపెట్టారని న్యాయస్థానం పేర్కొంది. క్రిమినల్ కేసులో ఆమెకు శిక్ష పడినా సరే పెన్షన్ హక్కును కాదనలేమని తీర్పు చెప్పింది.

హర్యానాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ భర్త తర్సెమ్‌సింగ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. 2008లో ఆయన మరణించగా, 2009లో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదైంది. ఈ కేసులో దోషిగా తేలిన ఆమెకు 2011లో శిక్ష పడింది. అప్పటి వరకు బల్జీత్‌ కౌర్‌కు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం ఆమెకు శిక్ష పడగానే నిలిపివేసింది. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన న్యాయస్థానం.. భర్తను ఆమె హత్య చేసినప్పటికీ, పెన్షన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. భర్త మరణానంతరం భార్యే కుటుంబ పింఛనుకు హక్కుదారు అవుతుందని, కాబట్టి ఆమెకు రావాల్సిన పింఛను, పాత బకాయిలను రెండు నెలల్లో విడుదల చేయాలని సంబంధింత శాఖను హైకోర్టు ఆదేశించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/