దేశాభివృద్దిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందిః ప్రధాని మోడీ

pm-modi-speech-at-warangal

వరంగల్‌ః తెలంగాణ ప్రజల బలం భారతదేశం బలాన్ని పెంచుతుందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలో రూ. 6,100 కోట్ల విలువైన అభివృద్ది పనులకు ప్రధాని మోడీ ఈరోజు శంకుస్థాపన చేశారు. అందులో రూ. 521 కోట్లతో వ్యయంతో కాజీపేటలో నిర్మించనున్న వ్యాగన్ తయారీ పరిశ్రమకు, రూ. 3,441 కోట్ల ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా వరంగల్‌-మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ పనులకు, రూ. 2,147 కోట్లతో జగిత్యాల- కరీంనగర్‌- వరంగల్‌ ఇంటర్ కారిడార్ పనులు ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నట్టుగా చెప్పారు. అనంతరం హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తవుతుందని గుర్తుచేశారు. దేశాభివృద్దిలో తెలంగాణది కీలక పాత్ర అని చెప్పారు. దేశ ఆర్థికవృద్దిలో కూడా తెలంగాణాది ప్రధాన భూమిక అని తెలిపారు. దేశాభివృద్దిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని చెప్పారు.

‘‘నేడు భారతదేశం ప్రపంచంలో 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పుడు, ఇందులో తెలంగాణ ప్రజల పాత్ర చాలా పెద్దది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం మొత్తం చాలా ఉత్సాహం ఉంది. ప్రపంచమంతా పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు వస్తున్నప్పుడు తెలంగాణకు అనేక అవకాశాలు ఉన్నాయి’’అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

21వ శతాబ్దపు ఈ మూడవ దశాబ్దంలో స్వర్ణకాలం మనకు వచ్చిందని మోడీ అన్నారు. ఈ స్వర్ణ కాలంలోని ప్రతి సెకనును మనం పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణలో నేడు రూ. 6వేల కోట్ల విలువైన అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించికుంటున్నామని చెప్పారు. దేశాభివృద్ది కోసం శరవేగంగా పనులు చేపడుతున్నామని చెప్పారు.