బంగారు తెలంగాణ అంటే ఏమిటో బిజెపి చూపెడుతుందిః ఈటల

బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మూడేళ్లుగా లోపాయికారీ ఒప్పందం ఉందన్న ఈటల

bjp-etela-rajender-fires-on-kcr-in-modi-sabha

వరంగల్‌ః తెలంగాణకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ గడ్డపై అడుగుపెట్టారని బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. వేల కోట్ల రూపాయలతో జాతీయ రహదారులను నిర్మించి, ఎప్పటి నుంచో మనం కలలుగన్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేసిన ఈరోజు ఉత్తర తెలంగాణకు శుభసూచకమని చెప్పారు. బిజెపితోనే తెలంగాణకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, దీనికి కేంద్ర పార్టీ బిజెపి సహకరించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఈటల చెప్పారు. బిఆర్ఎస్, బిజెపి రెండూ ఒకటేనని కొన్ని పేపర్లు, ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని… బొఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే లోపాయకారీగా పని చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం మూడు సంవత్సరాలుగా కొనసాగుతోందని చెప్పారు. వరంగల్ లో పలు కార్యక్రమాలకు ఈరోజు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

తప్పుడు హామీలిచ్చి, మన కళ్లల్లో మన్ను కొట్టిన కేసీఆర్ ను ఓడించాలని ప్రజలను ఈటల కోరారు. రాష్ట్ర ప్రజల బతుకేందో, కన్నీళ్లు ఏందో తెలిసిన బిడ్డగా చెపుతున్నానని… బిజెపినే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పారు. కెసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణ మాటల్లోనే ఉందని… అసలైన బంగారు తెలంగాణను చేతలతో బిజెపి చూపెడుతుందని… అందుకే బిజెపిని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నానని విన్నవించారు.