రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ..ఐక్య‌రాజ్య‌స‌మితి వార్నింగ్

న్యూయార్క్‌: ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఐక్య‌రాజ్య‌స‌మితి వార్నింగ్ ఇచ్చింది. యుద్ధం వ‌ల్ల పేద దేశాల్లో ధ‌ర‌లు పెరిగాయ‌ని, దీంతో ఆహార అభ‌ద్ర‌త ఏర్ప‌డిన‌ట్లు సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్ర‌స్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఎగుమ‌తులు ప్రారంభం కాకుంటే ప్ర‌పంచ‌వ్యాప్తంగా తీవ్ర ఆహార కొర‌త ఏర్ప‌డే ఛాన్సు ఉంద‌న్నారు. ర‌ష్యా, ఉక్రెయిన్ వార్ వ‌ల్ల నౌకాశ్ర‌యాల‌కు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. ఉక్రెయిన్ నుంచి స‌న్‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్‌తో పాటు గోధుమ‌లు, మొక్క‌జొన్న‌లు, ప‌ప్పు దినుసులు అధిక మొత్తంలో స‌ర‌ఫ‌రా అవుతాయి. అయితే పోర్టుల్లో నౌక‌లు స్తంభించ‌డంతో.. ఆహార ధాన్యాల స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిత్యావ‌స‌ర వ‌స్తువులు ధ‌ర‌లు పెరుగుతున్నాయి.

గ‌త ఏడాదితో పోలిస్తే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆహార ప‌దార్ధాలు ధ‌ర‌లు దాదాపు 30 శాతం పెరిగిన‌ట్లు యూఎన్ తెలిపింది. పోష‌కాహార లోపం, క‌రువు, ఆక‌లిబాధ‌ల‌తో ల‌క్ష‌లాది మంది బాధ‌ప‌డుతార‌ని గుటెర్ర‌స్ తెలిపారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో కావాల్సినంత ఆహారం ఉంద‌ని, ఈ స‌మ‌స్య‌ను ఇప్పుడు ప‌రిష్క‌రించకుంటే, రాబోయే నెలల్లో గ్లోబ‌ల్ ఫుడ్ షార్టేజ్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఉక్రెయిన్‌లో ఆహార ఉత్ప‌త్తి మ‌ళ్లీ పెర‌గాల‌ని, ఇంకా ర‌ష్యా, బెలార‌స్ నుంచి ఫెర్టిలైజ‌ర్లు కూడా అధిక మొత్తంలో మార్కెట్లోకి వ‌స్తేనే ప్ర‌పంచం గాడిలో ప‌డుతుంద‌ని గుటెర్ర‌స్ చెప్పారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/