మిజోరాం ఘటన..ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

pm-modi-is-shocked-by-the-mizoram-incident

న్యూఢిల్లీః ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలి 17 మంది కూలీలు మృతి చెందారు. మరో 30 మంది కూలీలు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐజ్వాల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూలి 17 మంది మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన 30 మందికి పైగా క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్గ్రేషియాను ప్రధాని మోడీ ప్రకటించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.