ప్రస్తుతం నాకు ఎలాంటి సెక్యూరిటీ లేదుః పయ్యావుల కేశవ్

గన్ మెన్ లేకుండానే చంద్రబాబు నివాసం వద్దకు వచ్చిన వైనం

payyavula-keshav-came-to-chandrababu-home-without-security

అమరావతిః టీడీపీ సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ భద్రత విషయంపై తాజాగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తనకు భద్రతను తొలగించారని పయ్యావుల కేశవ్ చెపుతుండగా… ఆయనకు భద్రతను కొనసాగిస్తున్నామని అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఇంకోవైపు తనను వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమించారని ఒక వ్యక్తి పయ్యావులకు పరిచయం చేసుకున్నాడు. వెంటనే విధుల్లో చేరాలని ఆయనకు పయ్యావుల సూచించారు.

ఆ తర్వాత సదరు వ్యక్తి తనకు కనిపించలేదని పయ్యావుల మీడియాకు తెలిపారు. ఈరోజు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పయ్యావుల వెళ్లారు. గన్ మెన్ లేకుండానే ఆయన వెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తన గన్ మెన్ అంటూ వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపారు. ప్రస్తుతం తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని… ఏం జరుగుతోందో చూద్దామని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/