రాష్ట్రంలో అప్పుడే అసలైన ప్రచారం ఉండనుందిః బిజెపి

bjp-national-leaders-campaign-in-telangana-after-nominations

హైదరాబాద్‌ః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ జోరు సాగిస్తుండగా.. పోటీగా కాంగ్రెస్​ కూడా ప్రచారంలో జోష్ పెంచింది. కానీ బిజెపి మాత్రం నామమాత్రంగానే ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే అసలు ప్రచారం నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాతే రాష్ట్రానికి జాతీయ నేతలు వస్తారని.. అప్పుడే అసలైన ప్రచారం ఉండనుందని తెలిపారు.

నవంబరు 3 నుంచి పదో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదో తేదీ తర్వాత రాష్ట్రానికి ప్రధాని మోడీ సహా పార్టీ అగ్రనేతలు అమిత్‌షా, జె.పి.నడ్డాతో, ఇతర కేంద్ర మంత్రులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేతలు వరుసగా రాష్ట్రంలో సభలు నిర్వహించేందుకు బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. హైదరాబాద్‌తోపాటు కీలక స్థానాల్లో భారీ బహిరంగ సభల ఏర్పాటు చేయడంపై రాష్ట్ర నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు.

హైదరాబాద్‌లో ప్రధాని మోడీతో రెండు విడతలుగా రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని రాష్ట్ర బిజెపి నేతలు ప్లాన్ చేస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో రెండో వారం తర్వాత బీసీ గర్జన బహిరంగ సభ నిర్వహించి బీసీ నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. సుమారు 15 రోజులపాటు రోజూ అగ్రనేతలు ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం.