నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేస్తున్నాను

చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా… సీఎం కేసీఆర్‌
నేటి నుంచి మ‌రో 10 ల‌క్ష‌ల మందికి ఆస‌రా పింఛ‌న్లు..సీఎం కేసీఆర్
ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం

CM KCR spoke after hoisting the national flag on Golconda Fort.

హైదరాబాద్ః నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ వీరులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని మహాత్మాగాంధీ గంగా జమునా తెహజీబ్‌గాఆ అభివర్ణించారన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ వీరులు ఉజ్వలమైన పాత్రను పోషించారని కెసిఆర్‌ అన్నారు. అలాంటి వీరుల్లో తుర్రేబాజ్ ఖాన్, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్, సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు మొదలైనవారు ఉన్నారని గుర్తు చేశారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం నుంచి నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రతి వర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, కడుపులో పెట్టి చూసుకుంటూ సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఖ్యాతి పొందింద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తున్నాను. ఆసరా పథకంలో భాగంగా నేటి నుంచి మరో 10 లక్షల మంది లబ్దిదారులకు పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. కొత్తగా ఇచ్చే పెన్షన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 46 లక్షల మందికి ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ది చేకూరుతుంది. ఫించన్ల మొత్తం పెంచడమే కాకుండా లబ్దిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని సవినయంగా తెలియజేస్తున్నానని కేసీఆర్ తెలిపారు.

అణగారిన దళితజాతి సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింద‌ని పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో తరతరాలుగా నిండిన చీకట్లను చీల్చే కాంతిరేఖగా దళితబంధు దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నది. తెలంగాణలో దళితబంధు పథకాన్ని ఒక సంక్షేమ పథకంగానే కాదు, ఒక సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నాం. యావత్ దళిత జాతి స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే వజ్ర సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంటు రూపంలో అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన, వచ్చిన పనిని లబ్దిదారులు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. ఏ విషయంలోనూ ఎటువంటి ఆంక్షలు విధించకపోవటమే ఈ పథకం గొప్పతనం అని తెలిపారు.

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ మొత్తం త్రివర్ణ శోభితమైందన్నారు. ప్రతి ఇంటిపైనా జెండా ఎగరవేయంతో తెలంగాణ మొత్తం త్రివర్ణ శోభితంతో మురిసిపోతోందన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి స్వేచ్ఛకు, సార్వభౌమాధికారానికి ప్రతీకగా త్రివర్ణ పతాకం ఆవిష్కృతమై నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందామన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ, నవభారత నిర్మాణంలోనూ మహోన్నతమైన పాత్ర పోషించిన జవహర్‌లాల్ నెహ్రూ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి మహానుభావుల సేవలు చిరస్మరణీయని కేసీఆర్ కొనియాడారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/