విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం తెలిపిన ప్రకటన ఫై పవన్ కళ్యాణ్ కామెంట్స్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిందే అని పట్టుబట్టిన కేంద్రం..ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై ముందుకు వెళ్ల‌డం లేద‌ని తెలిపింది. నేడు ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే. ఈ సందర్భంగా వారు కీలక ప్రకటన చేశారు. పూర్తిస్థాయి సామ‌ర్థ్యం మేర‌కు ప్లాంట్ ప‌ని చేసే ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌ని ప్ర‌క‌టించారు. ఆర్ఐఎన్ఎల్ యాజ‌మాన్యం, కార్మిక సంఘాల‌తో చ‌ర్చిస్తామ‌న్నారు. ఈ ప్రకటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

“ఎన్నో ఉద్యమాల ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ సిద్ధించింది. ఈ పరిశ్రమతో తెలుగువారి భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. విశాఖ ఉక్కు కేంద్రం ఆధీనంలోనే ఉండాలి. స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరారు” అని తెలిపారు.

ఈ పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడాలని కోరగా, వారి స్పందన ఎంతో ఆశావహంగా అనిపించిందని పవన్ వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరించడం లేదని, దీనిపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదని ఇవాళ కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటన ఆనందం కలిగించిందని పేర్కొన్నారు.

కొన్నిరోజుల కిందట విశాఖ ఉక్కుపై పొరుగు రాష్ట్రం స్పందించిందని, కానీ దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైస్సార్సీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారే తప్ప, పరిశ్రమను కాపాడతామనే మాట చెప్పలేకపోయారని పవన్ విమర్శించారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు కదల్లేదని ఆరోపించారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపుతోందని తెలిపారు. జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.