భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి

60 అడుగులకు చేరిన నీటిమట్టం

Godavari at Bhadrachalam
Godavari at Bhadrachalam

Bhadrachalam: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకు ప్రవాహం పెరుగుతున్నది. ఇప్పటికే చివరిదైన మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడం ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది.

కుండపోతగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద నది నీటిమట్టం రికార్డు స్థాయికి చేరింది.

ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి భారీగా వరద చేరడంతో ఏజెన్సీలోని నది పరివాహక ప్రాంతాలు వణికి పోతున్నాయి.

గోదావరి నీటిమట్టం 6 గంటలకు 48.1 అడుగుకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు 53 అడుగులకు చేరడంతో చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ప్రస్తుతం గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

దీంతో భద్రాచలం ఎగువన ఉన్న ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల, దుమ్ము గూడెం మండలాల్లోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది.

భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ఉచిత నిత్యాన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. కల్యాణకట్ట నీట మునిగింది.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చివరి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించడం ఆరేళ్ల తరువాత ఇదే తొలిసారి. 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/