ఇది కేసీఆర్ సాధించిన విజయం… ఇది బీఆర్ఎస్ విజయం – హరీష్ రావు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై కేంద్రం ఓ క్లారిటీ ఇవ్వడం తో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిందే అని పట్టుబట్టిన కేంద్రం..ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌పై ముందుకు వెళ్ల‌డం లేద‌ని కేంద్ర మంత్రి ఫ‌గ్గ‌న్ సింగ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పూర్తిస్థాయి సామ‌ర్థ్యం మేర‌కు ప్లాంట్ ప‌ని చేసే ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌ని కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించారు. ఆర్ఐఎన్ఎల్ యాజ‌మాన్యం, కార్మిక సంఘాల‌తో చ‌ర్చిస్తామ‌న్నారు. ఈ ప్రకటన పట్ల రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు.

కేసీఆర్ వల్లే కేంద్రం దిగొచ్చిందని బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును అమ్మబోవడంలేదని, బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని హరీశ్ రావు వెల్లడించారు. ఇది కేసీఆర్ సాధించిన విజయం… ఇది బీఆర్ఎస్ విజయం… ఇది ఏపీ ప్రజల విజయం… ఇది విశాఖ కార్మికుల విజయం అని ఉద్ఘాటించారు.

విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడామని వివరించారు. ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడిందని వెల్లడించారు. కానీ, విశాఖ ఉక్కుపై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదని హరీశ్ విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని అన్నారు.

కాగా బిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ..వైస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కేసీఆర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎప్పుడు మాట్లాడారని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను మొదట మేమే వ్యతిరేకించామని, ప్రైవేటీకరణను ఆపాలని సీఎం వైయస్‌ జగన్‌ కేంద్రానికి లేఖ రాశారని, ప్రధాని నరేంద్రమోదీని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.