జగన్ అయినా సరే పుట్టగానే ముఖ్యమంత్రి అయ్యాడా? : పవన్ కల్యాణ్

నరసాపురం నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం

pawan-kalyan

నరసాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నరసాపురం చేరుకుంది. ఈరోజు పవన్ కల్యాణ్ నరసాపురం జనసేన నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి జరుపుతున్న వారాహి విజయ యాత్రకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అద్భుతమైన ప్రజాదరణ లభించిందని అన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. మన మీద నమ్మకంతో మహిళలు సైతం బయటికి వచ్చి విపరీతమైన ఆదరణను కనబరుస్తున్నారు… వారికి మనం అండగా నిలబడాలి.. ఎంతో బలమైన భావజాలంతో పార్టీని స్థాపించి 10 ఏళ్ల పాటు నడపడం మామూలు విషయం కాదు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

మన పట్ల ప్రజల్లో స్వచ్ఛమైన ప్రేమ ఉంది… అది డబ్బులతో కొనే ప్రేమ కాదు… ప్రతిసారీ నేను రావడం కష్టం… పార్టీలో ఇతర నాయకత్వం కూడా బలంగా తయారవ్వాలి అని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సిపి ఒక్క స్థానం కూడా గెలవకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అది కష్టమైనా సరే మనం దాని కోసం పనిచేయాలి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. “జనసేనలో పెద్ద స్థాయి నేతలు లేరంటున్నారు. జగన్ అయినా సరే పుట్టగానే ముఖ్యమంత్రి అయ్యాడా? ఆయన అనేక దారుణాలు చేశాడు, అల్లర్లకు పాల్పడ్డాడు. జగన్ 18-19 ఏళ్ల వయసులోనే ఓ ఎస్సైని కొట్టాడు. స్నేహితులతో కలిసి ఆయుధాలతో వేటకు వెళుతున్నాడని పోలీసులు పట్టుకున్నారు…. కానీ జగన్ ఆ ఎస్సైని లోపలేసి కొట్టాడు. ఆయన స్ఫూర్తితో ఇప్పుడు మంత్రుల కొడుకులు ఎస్పీ, డీఎస్పీలను కొడుతున్నారు. మనమేమీ అలా చేయడం లేదు కదా… మనకు చట్టాలపై గౌరవం ఉంది. అయితే మన హక్కులకు భంగం కలగనంత వరకే అవతలి వ్యక్తుల హక్కులకు రక్షణ” అని స్పష్టం చేశారు.