కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదుః మంత్రి కెటిఆర్‌

కెసిఆర్‌ను ఎందుకు జైలులో పెడతారో నడ్డా చెప్పాలన్న కెటిఆర్

minister-ktr-fires-on-jp-nadda

హైదరాబాద్‌ : మంత్రి కెటిఆర్ ఈ రోజు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్కైవాక్‌ టవర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని కెటిఆర్ హెచ్చరికలు జారీ చేశారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సభలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ను ఎందుకు జైలులో పెడతారో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘జేపీ నడ్డా వచ్చి అడ్డమైన మాటలు మాట్లాడారు. కెసిఆర్‌ను జైలులో పెడతామని అంటున్నారు. అది ఎందుకో చెప్పాలి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ అందిస్తున్నందుకా? కెసిఆర్‌ కిట్లు, రెండు పడక గదుల ఇల్లు ఇస్తున్నందుకా? కెసిఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్‌?” అని నిలదీశారు. మాట్లాడడానికి ఓ హద్దు అదుపు ఉండాలని హితవు పలికారు. ఈ 23 ఏళ్లలో కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కెటిఆర్‌ మండిపడ్డారు. ‘‘ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జాప్యంతో ఎంతో మంది ఉద్యమకారులు చనిపోయారు. దానికి సోనియాగాంధీ కారణం కాదా?’’ అని ప్రశ్నించారు. అవినీతి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడితే పులి శాకాహారం గురించి మాట్లాడినట్లు హంతకుడు సంతాపం తెలిపినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికి జైలుకెళ్లొచ్చిన వ్యక్తి నీతి ముచ్చట్లను మనం వినాలా? అని ప్రశ్నించారు. 9 ఏళ్లలో ఒక్కో పని చేసుకుంటూ హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని కెటిఆర్ అన్నారు. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నామని చెప్పారు. ఈ విషయాలను ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు.