విపక్షాల కూటమి.. వార్నర్ గ్రూప్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్న శివసేన సామ్నా

ఇది కిరాయి సైన్యం కాదని… ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుందని వెల్లడి

uddhav thackeray
uddhav thackeray

ముంబయిః బిజెపికి వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలను శివసేన (యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక రష్యాలోని వాగ్నర్ గ్రూప్ తో పోల్చింది. వాగ్నర్ గ్రూప్ ఆఫ్ ఇండియా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతుందని వెల్లడించింది. నరేంద్ర మోడీ అధికారాన్ని సవాల్ చేసేందుకు పాట్నాలో వార్నర్ గ్రూప్ సమావేశమైందని, ఇది కిరాయి సైన్యం కాదని, చాలా ముఖ్యమైనదని సామ్నా పత్రిక పేర్కొంది. ఈ గ్రూప్ పోరాటం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉంటుదని, ఈ మేరకు పాట్నాలో సమావేశమైన వార్నర్ గ్రూప్ ఆఫ్ ఇండియా సంకేతాలు ఇచ్చిందని పేర్కొంది.

ఓటర్లపై ఒత్తిడి తేవడానికి, ఎన్నికల్లో విజయం సాధించేందుకు మోడీ-అమిత్ షా భారీ సంఖ్యలో కిరాయి సైనికులను సిద్ధం చేసుకున్నారని ఆరోపించింది. ఆ కిరాయి సైన్యం మొదట వారిపైనే తిరగబడుతుందని హెచ్చరించింది. ఇప్పుడు రష్యాలోను అదే కనిపిస్తోందని పేర్కొంది. రష్యాలో పుతిన్ మాదిరిగా భారత్ లోని నియంతృత్వాన్ని తీసుకు రావాలని మోడీ-అమిత్ షా ప్రయత్నిస్తున్నారని, కానీ ఆ కిరాయి సైన్యం దేశ సంపదను అమ్మేస్తోందని విమర్శించింది.

మరోవైపు, విపక్షాల కూటమిపై బిజెపి విమర్శలు గుప్పించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ… అదో ఫోటో సెషన్ అని ఎద్దేవా చేశారు. దీనికి ఉద్ధవ్ ఠాక్రే సామ్నా పత్రికలో తీవ్రంగా స్పందించారు. దేశంలో ఫోటో లవర్ ఎవరో తెలుసునని వ్యాఖ్యానించారు.