జనసేన, టిడిపి కలిసే ఎన్నికలకు వెళ్తాయి‌: పవన్‌ కల్యాణ్‌

సైబరాబాద్ వంటి నగరాన్ని నిర్మించిన వ్యక్తిని స్కామ్ అంటూ హింసిస్తున్నారని పవన్ మండిపాటు

pawan-kalyan-fires-on-jagan-after-meeting-with-chandrababu

రాజమహేంద్రవరం: రాజమండ్రి సెంట్రల్ జైల్లో టిడిపి అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ, యువనేత నారా లోకేశ్ సమావేశం ముగిసింది. వీరి సమావేశం 40 నిమిషాల పాటు కొనసాగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. టిడిపి, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించారు. ఇవాళ్టి ములాఖత్‌ ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమని అన్నారు. ‘‘ వైఎస్‌ఆర్‌సిపిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. ఇది మా ఇద్దరి భవిష్యత్‌ కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్‌ కోసమే. చంద్రబాబు రాజకీయవేత్త.. జగన్‌ ఆర్థిక నేరస్తుడు అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. “గత నాలుగున్నర సంవత్సరాలుగా ఏపీలో అరాచక పాలనను చూస్తున్నాం. అరాచక పాలనలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, చట్ట వ్యతిరేకంగా రిమాండ్ కు పంపించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడకు వచ్చాను, చంద్రబాబుపై గతంలో కూడా పాలసీ పరంగానే విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. మేము విడిగా కూడా పోటీ చేశాం. రాష్ట్రం బాగుండాలి, దేశ సమగ్రత బాగుండాలి అని నేను కోరుకుంటాను.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీకి రాజధాని కూడా లేదు. అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేయలేకపోయింది. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయాలు కొందమందికి ఇబ్బందిగా ఉంటాయి. దక్షిణ భారతంలో నేను మోదీకి మద్దతు తెలిపాను. ముంబయిలో ఉగ్రదాడి జరిగినప్పుడు దేశానికి బలమైన నాయకుడు కావాలని కోరుకున్నాను. అందుకే 2014లో మోడీ వచ్చిన తర్వాత ఆయనకు మద్దతు తెలిపాను. మోడీ పిలిచినప్పుడే నేను ఢిల్లీకి వెళ్లానే కానీ, నా అంతట నేను ఎప్పుడూ వెళ్లలేదు. విడిపోయిన ఏపీకి సమర్థవంతమైన నాయకుడు కావాలని నేను కోరుకున్నా. అందుకే చంద్రబాబుకు మద్దతు పలికాను. చంద్రబాబుతో పాలసీ పరంగా విభేదాలు ఉండొచ్చు. కానీ ఆయన అపారమైన అనుభవం రాష్ట్రానికి కావాలి. స్కిల్ డెవలప్ మెంట్ లో తప్పులు జరిగితే దాని బాధ్యులైన అధికారులను శిక్షించాలి. సైబరాబాద్ వంటి అద్భుతమైన సిటీని నిర్మించిన వ్యక్తిని రూ. 311 కోట్ల స్కామ్ అంటూ హింసిస్తున్నారు.

ఒక హార్డ్ కోర్ నేరస్తుడు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబును జైల్లో పెట్టించడం బాధాకరం. ఈడీ కేసులు ఉన్న వ్యక్తి, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు చేసే వ్యక్తి, విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతులు తీసుకునే వ్యక్తి, అందరినీ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేక ఓటును చీలనివ్వను అని 2020లోనే చెప్పాను. అప్పుడే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పద్ధతిగా పాలన సాగించి ఉంటే ఇప్పుడు బాలకృష్ణ గారు, నారా లోకేశ్ మధ్యన నిల్చొని మాట్లాడే పరిస్థితి నాకు వచ్చేది కాదు” అని అన్నారు.