‘సనాతన ధర్మం’ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ

సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలన్నది ‘ఇండియా’ కూటమి పన్నాగం.. ప్రధాని మోడీ

INDI Alliance Wants To End Sanatan Culture..PM Modi

న్యూఢిల్లీః ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’పై ప్రధాని మోడీ ఆరోపణలతో విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లా బినాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. స్వామి వివేకానంద, లోక మాన్య తిలక్ వంటి ఎంతో మంది గొప్పవారికి స్ఫూర్తినిచ్చిన ‘సనాతన ధర్మాన్ని’ తుడిచి పెట్టేయాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేడు వారు బహిరంగంగానే సనాతన ధర్మంపై దాడికి దిగారు. రేపు మనపైనా దాడి చేస్తారు. దేశ్యాప్తంగా ఉన్న సనాతనులు అందరూ , ఈ దేశాన్ని ప్రేమించే వారు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని మనం నిలువరించాలి’’అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై దురుసు వ్యాఖ్యలు చేయగా, దీన్ని కాంగ్రెస్ నేతలు సమర్థించడం తెలిసిందే.

ఎలాంటి వాస్తవిక విజన్ లేకుండా, నాయకత్వం లేకుండా ఇండియా కూటమి విభజన రాజకీయాలను విజయవంతంగా నడిపిస్తోందని ప్రధాని విమర్శించారు. ‘‘దేశాన్ని, ఈ సమాజాన్ని విభజించడానికి కొన్ని గ్రూపులు పనిచేస్తున్నాయి. వారంతా కలసి ‘ఇండియా కూటమి’ ఏర్పాటు చేసుకున్నారు. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి రహస్య అజెండా’’అని ప్రధాని విమర్శించారు. ఈ అమృత కాల దశలో ప్రతి భారతీయుడు.. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అందుకు గాను ఆత్మనిర్భర భారత్ గా మారాల్సిన అవసరం ఉందన్నారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన ఘనత 140 కోట్ల భారతీయులకే దక్కుతుందన్నారు.

బినాలో బీపీసీఎల్ అతిపెద్ద పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తుండగా, ఇందుకు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు ప్రధాని రావడవం గమనార్హం. ఈ పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ తో బినా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుంతుందని ప్రధాని పేర్కొన్నారు.