ప్రజల కష్టాలు తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చాను – పవన్ కళ్యాణ్

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రచారాన్ని దూకుడు పెంచుతున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన దారుణాలను ప్రజలకు వివరిస్తూ..కూటమి విజయం సాధిస్తే రాష్ట్రానికి జరిగే మంచి గురించి తెలియజేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నాడు. ఈరోజు కోనసీమ జిల్లా మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్‌ ప్రసంగించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..కన్నతల్లి లాంటి సినిమా పరిశ్రమను వదిలి డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేసారు. ప్రజల కష్టాలు తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైసీపీ ఐదేళ్ల ఆరాచక పాలన నుంచి ఏపీని విముక్తి చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని పేర్కొన్నారు. జగన్‌పై చిన్న గులకరాయి పడితేనే యువకుడిని అరెస్టు చేసి కేసుపెట్టారని, దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన అనంతబాబుపై మాత్రం చర్యలు లేవని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని విమర్శించారు. జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలాంటి రౌడీలకు తాను భయపడనని తేల్చి చెప్పారు.

భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలను వైఎస్ జగన్ అడ్డుకోవాలని చూశారని ..నేను వెళ్లి జగన్ను బతిమిలాడతాను అని అనుకున్నాడు. అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్లో సినిమాలను వదిలే వ్యక్తిని నేను. నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను’ అని పవన్ స్పష్టం చేశారు. 18 రోజుల్లో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆ తర్వాత అవినీతిపరుల భరతం పడతామని పవన్ హెచ్చరించారు.