చిమ్మచీకట్లలో ఆంధ్రప్రదేశ్ ఉందంటూ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ వెలుగుజిలుగులతో ధగధగా మెరిసిపోతుంటే.. అదే ఆంధ్రప్రదేశ్ చిమ్మచీకట్లలో ఉందంటూ నగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు ముంబయి బస్సులను పట్టుకొని వలస పోయేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయి అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని సీఎం సూచించారు.

తలసరి ఆదాయంలో మనమే దేశంలో నంబర్‌వన్‌. తలసరి విద్యుత్తు వినియోగంలో మనమే నంబర్‌వన్‌. ఒక్క తెలంగాణాలో తప్ప.. మరెక్కడైనా ఈ తరహా పథకాలున్నాయా..? రాష్ట్రం వస్తే కారుచీకట్లలోనే తెలంగాణ ఉంటుందని ఆంధ్రావాళ్లు శాపెనలు పెట్టిండ్రు. కానీ, ఇప్పుడు తెలంగాణ వెలుగుజిలుగులతో ధగధగా మెరిసిపోతున్నది. అదే ఆంధ్ర చిమ్మచీకట్లలో ఉన్నది. దేశంలో అన్నివర్గాలకు 24 గంటలపాటు కరెంటు ఇచ్చే రాష్ట్రం లేదు. రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చే రాష్ట్రం లేనేలేదు. దీన్ని మీరు పోగొట్టుకోవద్దు అని సూచించారు.

సీఎం కేసీఆర్‌ దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగం ఆసాంతం ప్రజలు శ్రద్ధగా విన్నారు. పాలమూరుతో తనకున్న అనుబంధాన్ని, ఉద్యమానుభవాన్ని కేసీఆర్‌ తనదైన శైలిలో ఆవిష్కరించారు. ‘దుందుభివాగు మీద గోరటి వెంకన్న పాట రాసిండు. నాకు ఆయినలెక్క పాడరాదు కానీ..’ అని సీఎం కేసీఆర్‌ అనగానే నవ్వులు విరబూశాయి. నాగర్‌కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు ప్రస్తావన వచ్చినపుడు ‘తుపాకీ గుండు జనార్దన్‌రెడ్డి’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొనటంతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఈ బహిరంగ సభ జోష్‌ను నింపింది.