మరికాసపేట్లో ఢిల్లీ నుండి మంగళగిరి కి రానున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ఢిల్లీ నుండి మంగళగిరి కి రానున్నారు. NDA సమావేశానికి హాజరైన పవన్ ..రెండు రోజులుగా ఢిల్లీ లోనే మకాం వేశారు. అక్కడ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాలు, ఏపీ అభివృద్ధికి కావాల్సిన అంశాలు , రాబోయే ఎన్నికల్లో పొత్తుల అంశం వంటివి బిజెపి పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. మరికాసేపట్లో మంగళగిరి పార్టీ ఆఫీస్ కు చేరుకోబోతారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలను కలవడం ఫై , రాబోయే ఎన్నికల్లో బిజెపి – టిడిపి – జనసేన కలిసి బరిలోకి దిగబోతాయని చెప్పడం పట్ల వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మంత్రి రోజా అయితే పవన్‌ కల్యాణ్‌ దళపతి కాదు.. దళారీ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు కోసం ఢిల్లీలో పవన్‌ కల్యాణ్‌ దళారీగా మారాడని, తన తల్లిని తిట్టించిన వ్యక్తి కోసం పవన్‌ దళారీగా మారడం సిగ్గుచేటని ఆమె అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడు కానీ, ప్రజల కోసం పనిచేయడం లేదని కాపులు, జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు.

చంద్రబాబు దిగజారుడు, అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఎన్టీయే సమావేశానికి పిలవకుండా పక్కనబెట్టారన్నారు. ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాదెండ్ల మనోహర్‌ చెబుతారని పవన్‌ మాట్లాడటం సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు అని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. సినిమాల్లో రైటర్స్‌ రాసిచ్చింది.. మీటింగ్స్‌లో చంద్రబాబు స్క్రిప్టు మాత్రమే చదువుతావా..? అని నిలదీశారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై పాసిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ బిజెపి పార్టీపై విమర్శలు గుప్పించిన పవన్.. ఇప్పుడు ఎన్డీఏలో ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైస్సార్సీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌ డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేత, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ఏమైన సాధించారా..? అంటూ ప్రశ్నలు సంధించారు. పవన్ కల్యాణ్‌ ఊసరవెల్లి.. రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు. ఆంధ్రాలో భోజనం చేసి తెలంగాణలో నిద్రపోయే వ్యక్తులు పవన్ కల్యాణ్‌, చంద్రబాబు అంటూ విమర్శించారు.