రష్యా ఉక్రెయిన్ పై ఏ రోజు అయినా దాడికి దిగొచ్చు: అమెరికా

కనీసం 50వేల మంది చనిపోవచ్చు.. అమెరికా భద్రతా సలహాదారు

వాషింగ్టన్ : రష్యా ఏ రోజు అయినా ఉక్రెయిన్ పై దాడికి దిగొచ్చని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ అన్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నెల మధ్యనాటికి రష్యా తన ఆయుధ సంపత్తిలో 70 శాతాన్ని రంగంలోకి దించొచ్చని, తద్వారా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించొచ్చంటూ అమెరికా అధికారులు కూడా ఇప్పటికే అధ్యక్షుడికి నివేదించారు. తాజాగా సల్లివన్ కూడా ఇదే విధంగా హెచ్చరించడం గమనార్హం.

‘‘యుద్ధం ఆరంభమైతే ఉక్రెయిన్ కు తీవ్రమైన ప్రాణ నష్టం వాటిల్లుతుంది. కానీ, మా ఏర్పాట్లు, మా స్పందన ఆధారంగా రష్యాకూ తగినంత నష్టం వాటిల్లుతుందని మేము నమ్ముతున్నాం’’ అని సల్లివన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ వైపు కనీసం 50 వేల మంది ప్రాణాలు కోల్పోవచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. ఉక్రెయిన్ పై రానున్న వారాల్లో యుద్ధానికి దిగాలన్న ఉద్దేశ్యంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నట్టు, ఏ స్థాయిలో ఇది ఉంటుందన్న దానిపై స్పష్టత లేదని అమెరికా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దౌత్యపరమైన పరిష్కారానికి ఇప్పటికీ అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/