భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు , ఎగువను కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. వరద ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్‌ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్‌ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీబ్యారేజ్‌ ఇన్‌ఫ్లో 4,38,880 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా ఉంది.

ఇక కడెం ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 690.500 అడుగులకు చేరింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ఒక గేటును రెండు అడుగుల మేర ఎత్తి 2,865 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కుమ్రంభీం ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 237 అడుగులుగా ఉంది. కుమ్రంభీం ప్రాజెక్టు ప్రస్తుత ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1040 క్యూసెక్కులుగా ఉంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కూడా నీటి ఉదృతి పెరిగింది. ఇన్‌ఫ్లో 33,050 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1046 క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ ప్రస్తుత నీటిమట్టం 1072 అడుగులకు చేరింది.

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 5 జిల్లాలకు రెడ్‌, 7 జిల్లాలకు ఆరెంజ్‌, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీచేసింది.