తెలంగాణ బిజెపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

తెలంగాణ బిజెపి నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు గాను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ‘ఛలో బాట సింగారం’ అనే కార్యక్రమానికి ఈరోజు పిలుపునిచ్చారు. ఈ పిలుపుమేరకు బిజెపి నేతలు డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలనకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు బిజెపి నేతలను ఎక్కడిక్కడే అడ్డుకుంటూ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే డీకే అరుణ, ఈటల రాజేందర్ లను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ లపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

6 లక్షల 10 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలంగాణ సర్కార్ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని , అందుకు గాను కేంద్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో 2 లక్షల 83 వేల డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం మంజూరు చేసింది. అయితే ప్రభుత్వం ఇళ్లను ఎందుకు చేపట్టలేదని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నిధుల నుండి ఒక్కో బెడ్ రూంకి 6 లక్షలు ఖర్చు చేసిన 2 లక్షల 83 వేల ఇళ్లు పూర్తి అయ్యేవని అంటోంది బీజేపీ. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయని వారంతా ఆందోళన చేస్తున్నారు.

ఇక ఈనెల 24న అన్ని జిల్లా కలెక్టరేట్ ల వద్ద డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం ధర్నాలు చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. అలాగే ఈ నెల 25న ఇందిరా పార్క్ దగ్గర కూడా ఆందోళన చేయాలనీ భావిస్తుంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో 9 వేల కోట్ల అవినీతి జరిగిందని, 10 జిల్లాల్లో ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదని , గడిచిన 9 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ది దారులకు ఇచ్చింది 28 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు మాత్రమేనని బీజేపీ ఆరోపిస్తోంది.