మా దేశంలో కరోనా అంతమైపోయింది..ఉత్తర కొరియా

డబ్ల్యూహెచ్ వోకు వెల్లడి

ప్యోంగ్యాంగ్ : తమ దేశంలో కరోనా అంతమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)కు ఉత్తరకొరియా వెల్లడించింది. జూన్ 10 నుంచి ఇప్పటిదాకా రోజూ 30 వేల టెస్టులు చేస్తున్నా ఒక్క కేసు కూడా నమోదవలేదని పేర్కొంది. మంగళవారం విడుదల చేసిన మానిటరింగ్ నివేదికలో డబ్ల్యూహెచ్ వో ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ 4 నుంచి 10 మధ్య 733 మందికే వైరస్ సోకిందని ఉత్తర కొరియా చెప్పినట్టు పేర్కొంది. ఇక, తమ ఉనికి కోసం కరోనా మహమ్మారి వ్యాప్తి పెరిగిపోకుండా ఎన్నో చర్యలు తీసుకున్నామని డబ్ల్యూహెచ్ వోకు రాసిన లేఖలో కొరియా వెల్లడించింది. పర్యాటకంపై నిషేధం విధించామని, సరిహద్దులను మూసేశామని, దౌత్యవేత్తలను పంపించేశామని పేర్కొంది. దశాబ్దాల కాలంగా దుర్నిర్వహణ, అమెరికా ఆంక్షలతో ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ.. తాము విధించుకున్న స్వీయ లాక్ డౌన్ లతో మరింతగా దిగజారిపోయిందని తెలిపింది.

అయితే, నిపుణులు మాత్రం ఉత్తరకొరియా వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు చాలా హీనంగా ఉన్నాయంటున్నారు. అంతేగాకుండా దాని మిత్రదేశం, ఆర్థికంగా చేదోడుగా ఉండే చైనాతో ఉన్న సరిహద్దులు అంత పటిష్ఠంగా లేవని చెబుతున్నారు. కాబట్టి ఆ దేశంలో ఒక్క కేసు కూడా లేదంటే నమ్మే విషయం కాదని అంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/