బెంగాలీ చిత్రసీమలో విషాదం ..ప్రముఖ నటి ఆత్మహత్య

చిత్రసీమలో వరుస విషాదాలు అభిమానులను , సినీ పరిశ్రమను దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. కొంతమంది అనారోగ్య కారణాలతో కన్నుమూస్తుంటే, మరికొంతమంది ఆత్మహత్య లు చేసుకుంటూ కుటుంబ సభ్యులను , చిత్రసీమ ను శోకసంద్రంలో పడేస్తున్నారు. తాజాగా బెంగాలీ చిత్రసీమలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.

ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మంజుదార్ (21) ఆత్మహత్య చేసుకుంది. కోల్‌కతాలోని తన నివాసంలో ఆమె శవమై తేలింది. అలాగే తన చావుకు గల కారణాలు తెలుపుతూ ఒక సూసైడ్ నోట్‌ను కూడా రాసింది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక పోలీసులు తెలిపిన ప్రకారం…కోల్‌కతాలోని తన అపార్ట్‌ మెంట్‌లో నాలుగేళ్లుగా తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. అయితే ఆమె ఈ నెల 25వ తేదీన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెప్పుకొచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఇంటి తలుపులు బద్ధలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించగా.. బిదిషా ఉరేసుకుని వేలాడుతూ కనిపించిందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించిందన్నారు. ఈ మేరకు సన్నిహితులను, కుటుంబసభ్యులను విచారిస్తున్నామన్నారు.